ఏపీలో తల్లీబిడ్డల సురక్షిత ప్రయాణానికి కొత్త శకం

Written by TV2O TELUGU

Published on:

300 ఆధునిక తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ప్రారంభం

నరసరావుపేటలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు 300 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ఆధునిక వాహనాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రూపొందించిన ఈ వాహనాలు దేశంలోనే తొలిసారి అత్యాధునిక భద్రతా సౌకర్యాలతో కూడినవి.మొత్తం 500 వాహనాలను ప్రభుత్వం సమకూర్చుతోంది. తొలి దశలో 300 వాహనాలను రోడ్డెక్కించగా మిగిలిన 200 వాహనాలను రెండు నెలల్లోపు అందుబాటులోకి తీసుకురానున్నారు. జిల్లాల్లో నమోదవుతున్న ప్రసవాల సంఖ్య ఆధారంగా వాహనాలను శాస్త్రీయంగా కేటాయించారు.

ఈ కొత్త వాహనాలు ఎయిర్ కండిషన్డ్ ఎస్‌యూవీ/ఎంయూవీ తరహాలో ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకు ఆరు ఎయిర్‌బ్యాగులు, వెనుక సీట్ బెల్టులు, చైల్డ్ లాక్ స్లైడింగ్ డోర్లు, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్‌పీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, 80 కిమీ/గంట వేగం దాటితే స్పీడ్ అలర్ట్ వ్యవస్థ వంటి సౌకర్యాలు కల్పించారు. గర్భిణులు, బాలింతలు సులభంగా ఎక్కడానికి ప్రత్యేక ఫుట్‌రెస్టులు, హ్యాండ్‌రెయిల్స్ ఏర్పాటు చేశారు.

వాహనంలోనే ఎస్‌ఓఎస్ బటన్ ఉంది. ఏదైనా సమస్య వస్తే నొక్కగానే సమాచారం నేరుగా 102 కాల్ సెంటర్‌కు చేరుతుంది. లైవ్ జీపీఎస్ ట్రాకింగ్ (ఏఐఎస్-140 ప్రమాణాలు, జీపీఎస్, నావిక్ డ్యూయల్ సాటిలైట్), డ్యూయల్ సిమ్ 4జీ కనెక్టివిటీ, ఆఫ్‌లైన్ డేటా స్టోరేజ్, బ్యాకప్ బ్యాటరీ, మొబైల్ ఛార్జింగ్ పోర్టులు, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. నవజాత శిశువులకు అనుకూలమైన ఉష్ణోగ్రత నియంత్రణ ఏసీ వసతి కూడా కల్పించారు.

ప్రయాణ సమయంలో వాహనంలోని ఆడియో సిస్టమ్ ద్వారా తల్లిపాలు, నవజాత సంరక్షణ, పోషణ, టీకాలు, ప్రసవానంతర జాగ్రత్తలపై ప్రభుత్వ సూచనలు నిరంతరం వినిపిస్తాయి.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లి, శిశువుకు మాత్రమే ఈ డ్రాప్-బ్యాక్ సేవ ఉచితం. తల్లి, బిడ్డతో పాటు ఇద్దరు అటెండెంట్లు ప్రయాణించవచ్చు. హైరిస్క్ గర్భిణులు, తీవ్ర రక్తహీనతతో రక్తమార్పిడి అవసరమైనవారికి ప్రత్యేక పికప్, డ్రాప్-బ్యాక్ సేవలు అందుతాయి. రాష్ట్రంలో ఏ ఫోన్ నుంచైనా టోల్ ఫ్రీ 102కు కాల్ చేస్తే సరిపోతుంది. 2026-27కి రూ.37.40 కోట్ల బడ్జెట్ కేటాయించారు.

మాతా, శిశు మరణాలు తగ్గించడం, ప్రసవానంతర సంరక్షణను మెరుగుపరచడం, హైరిస్క్ గర్భిణులకు సకాలంలో రవాణా అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. తల్లీబిడ్డల సురక్షిత ప్రయాణానికి ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రాధాన్యత రాష్ట్రంలోని వేలాది కుటుంబాలకు ఊరటగా నిలుస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు.

Leave a Comment