వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే ఊరుకునేది లేదు

Written by TV2O TELUGU

Published on:

పుష్పశ్రీవాణిని హెచ్చరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే జగదీశ్వరి

కురుపాం: వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే ఇకపై ఊరుకునేది లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణిని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి హెచ్చరించారు. గిరిజనులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే జగదీశ్వరి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం కోటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి పనుల క్రెడిట్ చోరీ చేయాల్సిన అవసరం లేదన్నారు. కురుపాం, భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు.

రెండుసార్లు ప్రజలు అవకాశం ఇచ్చినా రెండు నూతన ఆసుపత్రి భవనాలను ఎందుకు పూర్తి చేయలేకపోయారని పుష్పశ్రీవాణిని ప్రశ్నించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో సుమారు రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అభివృద్ధి జరగలేదని మాట్లాడటం సరికాదన్నారు. పుష్పశ్రీవాణి ప్రస్తుతం ప్రయాణిస్తున్న రహదారులను తామే నిర్మించామని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

మంత్రి అచ్చెన్నాయుడుపై విమర్శలు చేయడానికి పుష్పశ్రీవాణికి నైతిక అర్హత లేదని జగదీశ్వరి విమర్శించారు. 164 జీఓ రద్దు విషయంలో గిరిజన రైతులకు ఇబ్బందులు కలిగించింది ఎవరో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

గిరిజనులపై వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు

గిరిజనులపై ఇష్టానుసారంగా మాట్లాడితే మీ ఇళ్లను ముట్టడించే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యే జగదీశ్వరి హెచ్చరించారు. ఇప్పటివరకు తాను వ్యక్తిగతంగా ఎలాంటి విమర్శలు చేయలేదని, ఇకపై తనపైనా, గిరిజనులపైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు.

తాను గిరిజన మహిళగా ఈ ప్రాంత ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పనిచేస్తున్నానని, గిరిజనులపై చిన్నచూపు వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. నియోజకవర్గంలో గతంలో రెండు పర్యాయాలు అవకాశం పొందిన పుష్పశ్రీవాణి చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు చూపించాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.

డీఎస్సీ అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలి

డీఎస్సీ అంశంపై అసెంబ్లీలో చర్చించేందుకు వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను పంపించాలని జగదీశ్వరి సూచించారు. సమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా ర్యాలీలు, దీక్షల పేరుతో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

లోకేష్ ఎందుకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించిన ఎమ్మెల్యే.. కేవలం రాజకీయ ఉనికి కాపాడుకునేందుకే ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారని విమర్శించారు.

ప్రజలు వైసీపీని నమ్మే పరిస్థితి లేదని, కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టి ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పేర్కొన్నారు.

Leave a Comment