
కరీంనగర్ :సంక్షేమ శాఖ టెండర్ల లో రెండు వేల కోట్ల స్కామ్ జరిగిందని బిఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు చేసిన ఆరోపణలపై మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీరియస్ గా స్పందించారు. సంక్షేమ శాఖలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే ముగ్గురం మంత్రులం రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు.
కరీంనగర్ లో మీడియాతో మంత్రులు మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్ల నిత్యావసర వస్తువుల కొనుగోళ్ల టెండర్లపై బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. సమయం, వేదిక ఖరారు చేయాలని హరీష్ రావుకు సవాల్ విసిరారు. ఎస్సీ బీసీ మైనార్టీ మంత్రులపై హరీష్ రావు జాలి చూపాల్సిన అవసరం లేదన్నారు. సంక్షేమ శాఖ సెంట్రల్ ప్రొక్యూర్ మెంట్ టెండర్లు మొత్తం 2000 కోట్లు కానప్పుడు 2 వేల కోట్ల స్కాం ఎలా జరుగుతుందన్నారు. ఎస్సీ బీసీ మైనార్టీ మంత్రులను అవమాన పర్చడం, ఆగౌరవ పరచడమే మీ సంస్కృతా…. ఎస్సీ బిసి మైనారిటీ సామాజిక వర్గాల పట్ల అంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు. అసత్య ఆరోపణలు చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మేము పారదర్శకంగా ఉన్నామని, మీరు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, BRS ఎస్ఐఆర్ పై ఆందోళన చేస్తుంటే బీజేపీ ఎందుకు స్పందించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. 2002 లో ఎస్ఐఆర్ జరిగినపుడు భారత ప్రజాస్వామ్యంలో ఎవరు ఓటు తొలగవద్దని భావించామని, ఇపుడు బీజేపీ వ్యతిరేక ఓట్లు తొలగించాలని SIR తీసుకొచ్చారని ఆరోపించారు.