మహిళల భద్రతకు ‘ఆపరేషన్‌ దండాయన’

Written by TV2O TELUGU

Published on:

మహిళల భద్రతకు ‘ఆపరేషన్‌ దండాయన’

  • నేరస్థులకు త్వరితగతి శిక్షలే లక్ష్యం…
  • 60 రోజుల్లో ఛార్జిషీట్లు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక నిఘా..
  • మహిళలపై నేరాలకు జీరో టాలరెన్స్‌ పాలసీ. స్పీడ్‌ ట్రయల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌తో నిరంతర పర్యవేక్షణ..
  • బాధితులకు న్యాయ సహాయం, కౌన్సెలింగ్‌ సేవలు. పునరావృత నేరస్థులపై జియో ట్యాగింగ్ ద్వారా ప్రత్యేక నిఘా…
  • ‘నైబర్‌హుడ్‌ వాచ్‌’తో ప్రజల భాగస్వామ్యం…
  • అవగాహన కార్యక్రమాలతో నేరాల నివారణకు చర్యలు..

డీజీపీ శ్రీ హరీష్‌కుమార్‌ గుప్తా
మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలను పూర్తిగా అరికట్టేందుకు, బాధితులకు వేగవంతమైన న్యాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ రాష్ట్రవ్యాప్తంగా ‘ఆపరేషన్‌ దండాయన’ పేరుతో ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించింది. మహిళల భద్రతను అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తూ డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ఆధ్వర్యంలో, మహిళా & శిశు భద్రత విభాగం ఐజీపీ బి. రాజకుమారి నేతృత్వంలో ఈ కార్యాచరణ అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా శుక్రవారం ఏపీ పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు.

మహిళలపై నేరాలకు ప్రత్యేక కార్యాచరణ
ఆపరేషన్‌ దండాయన కార్యక్రమంలో భాగంగా మహిళలపై జరిగే అత్యాచారాలు, లైంగిక వేధింపులు, పోక్సో కేసులు తదితర నేరాల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నారు.

60 రోజుల్లో ఛార్జిషీట్‌.. ఫాస్ట్‌ట్రాక్‌ విచారణ
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యే మహిళా సంబంధిత ప్రతి కేసును ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. దర్యాప్తు ప్రక్రియలో జాప్యం లేకుండా చూసేందుకు ‘స్పీడ్‌ ట్రయల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌’ అమలు చేయాలని నిర్ణయించారు. కేసుల పురోగతిని జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిరంతరం సమీక్షిస్తూ న్యాయ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ముఖ్యంగా ప్రతి కేసులో 60 రోజుల్లోగా ఛార్జిషీట్‌ దాఖలు చేయడం తప్పనిసరిగా పేర్కొన్నారు. సంచలనాత్మక కేసులను ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులకు బదిలీ చేసి, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోనున్నారు.

జీరో టాలరెన్స్‌ పాలసీ అమలు
మహిళలపై నేరాల విషయంలో *‘జీరో టాలరెన్స్‌ పాలసీ’ని ఖచ్చితంగా అమలు చేస్తామని డీజీపీ శ్రీ హరీష్‌కుమార్‌ గుప్తా స్పష్టం చేశారు. నిందితులు ఎంతటి రాజకీయ, ఆర్థిక లేదా సామాజిక పరిపుష్టి కలిగిన వారైనా చట్టం ముందు అందరూ సమానమేనని తెలిపారు. ప్రతి బాధితురాలికి పూర్తి న్యాయం జరిగే వరకు పోలీసు శాఖ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. బాధిత మహిళలకు కేవలం న్యాయ సహాయం మాత్రమే కాకుండా, మానసిక ధైర్యం కల్పించేలా కౌన్సెలింగ్‌ సేవలను కూడా అందించనున్నారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు, న్యాయవాదులు, మహిళా సంక్షేమ సంస్థల సహకారాన్ని తీసుకోనున్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు.

పునరావృత నేరస్థులపై ప్రత్యేక నిఘా….
మహిళలపై పదేపదే నేరాలకు పాల్పడే నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తులపై జియో ట్యాగింగ్, FRS (Facial Recognition System) ద్వారా.. వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను డీజీపీ ఆదేశించారు. లైంగిక నేరస్తులపై సెక్సువల్ అఫెండర్స్ షీట్స్ తెరచి.. వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని… అలాగే పెండింగ్‌లో ఉన్న కేసులను పునఃసమీక్షించి, దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు.

‘నైబర్‌హుడ్‌ వాచ్‌’తో ప్రజల భాగస్వామ్యం….
ప్రజల భాగస్వామ్యంతో మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ‘నైబర్‌హుడ్‌ వాచ్‌’ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయనున్నారు. గ్రామాలు, పట్టణాల్లో స్థానిక ప్రజల సహకారంతో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించే విధానాన్ని ప్రోత్సహించనున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ జియోట్యాగింగ్‌, డిజిటల్‌ మానిటరింగ్‌ వ్యవస్థల ద్వారా నేరస్థులపై మరింత సమర్థవంతమైన నిఘా కొనసాగించనున్నారు.

అవగాహన సదస్సులు
నేరాల నివారణలో భాగంగా సమాజంలో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి చట్టాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా వేదికల ద్వారా మహిళల భద్రత, చట్టపరమైన హక్కులు, శిక్షల తీవ్రతపై విస్తృత ప్రచారం చేపట్టనున్నారు. ఇటీవలి కేసుల్లో కోర్టులు విధించిన శిక్షలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా నేరస్థుల్లో భయాన్ని, సమాజంలో చట్టంపై నమ్మకాన్ని పెంపొందించడమే లక్ష్యంగా చర్యలు కొనసాగనున్నాయి.

డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా
ఈ సందర్భంగా డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా మాట్లాడుతూ, “మహిళలపై నేరాల విషయంలో ఏ మాత్రం ఉపేక్ష ఉండదు. ప్రతి బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఆపరేషన్‌ దండాయన నిరంతరంగా కొనసాగుతుంది. నిందితులు ఎంతటి శక్తివంతులైనా చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోలేరు” అని స్పష్టం చేశారు.
మహిళల భద్రతకు ప్రభుత్వం, పోలీసు శాఖ అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించి నేరరహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని డీజీపీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డీజీపీ రాజీవ్‌కుమార్‌ మీనా (SLPRB) ఐపీఎస్‌, అదనపు డీజీ శాంతిభద్రతలు ఎన్‌. మధుసూదన్‌రెడ్డి ఐపీఎస్‌, నిఘా విభాగాధిపతి మహేష్‌ చంద్ర లడ్డా ఐపీఎస్‌, ఐజీపీలు సీహెచ్‌. శ్రీకాంత్‌ (ఆపరేషన్స్‌), పీహెచ్‌డీ రామకృష్ణ (SIB), బి. రాజకుమారి (Women & Child Safety Wing) తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Comment