
అర్ధరాత్రి వేళ ఆటోలో ప్రయాణిస్తున్న ఓ యువతిని వేధించి, ఆమె వద్ద ఉన్న నగదును దోచుకున్న ఆటో డ్రైవర్ ఉదంతం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది..బాధితురాలు సమయస్ఫూర్తితో వ్యవహరించి ‘శక్తి యాప్’ ద్వారా పోలీసులను అప్రమత్తం చేయడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. డీఎస్పీ మురళి కృష్ణ ఈ సందర్భంగా మీడియా కు వివరాలు వెల్లడించారు..పెద్దకాకాని మండలం నంబూరుకు చెందిన బాధితురాలు బెంగళూరులో ఇంటర్న్‌షిప్ చేస్తూ, పరీక్ష నిమిత్తం విజయవాడ చేరుకుంది. బస్టాండ్ నుండి ఇంటికి వెళ్లేందుకు బొమ్మనపల్లి ఫణీంద్ర కుమార్ అనే వ్యక్తి ఆటో ఎక్కింది. ప్రయాణ సమయంలో డ్రైవర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, మొబైల్ నంబర్ ఇవ్వాలని వేధిస్తూ ఆటోను నిర్మానుష్య ప్రాంతాల వైపు మళ్లించాడు.పరిస్థితిని గమనించిన బాధితురాలు భయాందోళనకు గురి కాకుండా, ప్రయాణంలోనే తన ఫోన్‌లో ‘శక్తి యాప్’ డౌన్‌లోడ్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. నిందితుడు ఆమెపై దాడి చేసి పర్సులోని రూ.5 వేలు/- నగదును బలవంతంగా లాక్కున్న సమయంలోనే, సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ తన సిబ్బందితో కలిసి కాజ టోల్‌గేట్ సమీపంలో ఆటోను అడ్డుకున్నారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడు ఫణీంద్రను చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడు గతంలో పాలకొండ గ్రామంలో వాలంటీర్‌గా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డిఎస్పి మురళీకృష్ణ తెలిపారు.నిందితుడి నుంచి ఆటో, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మహిళలు అత్యవసర పరిస్థితుల్లో ‘శక్తి యాప్’ను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.ఈ విలేఖరుల సమావేశం లో సీఐ ఏవి బ్రహ్మం, ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ సిబ్బంది పాల్గొన్నారు.