తిరుమలలో శ్రీ పద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవ వేడుకలు కనులపండువగా కొనసాగుతున్నాయి. వైశాఖ శుద్ధ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని, రెండో రోజు వేడుకలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించింది. పురాణాల ప్రకారం స్వామి, అమ్మవార్ల అసలు కల్యాణ ముహూర్తం ఇదే రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
నారాయణగిరి ఉద్యానవనాల్లో ప్రత్యేకంగా అలంకరించిన పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలు జరిగాయి. పచ్చని ప్రకృతి ఒడిలో, విద్యుత్ దీపకాంతుల మధ్య మండపం దేదీప్యమానంగా వెలిగిపోయింది. రెండో రోజు వేడుకల్లో భాగంగా శ్రీనివాస స్వామి, పద్మావతీ అమ్మవారు విశేష అభరణాలు, సుగంధ భరిత పుష్ప మాలలతో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మలయప్ప స్వామిని బంగారు తిరుచ్చిపై ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకువచ్చారు. వైశాఖ శుద్ధ దశమి రోజున స్వామివారి వివాహం జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర ఘడియల్లో స్వామిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ పరిణయోత్సవం తిరుమల కొండపై ఆధ్యాత్మిక శోభను నింపింది. రేపు జరగనున్న చివరి రోజు వేడుకలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.ఈ ఉత్సవాల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి సేవలను అధికారులు రద్దు చేశారు.