శివ..శివా! అంధకారంలో మంగళగిరి మహాశివుడు

Written by TV2O TELUGU

Published on:

గుంటూరు జిల్లా
మంగళగిరి

శివ..శివా! అంధకారంలో మంగళగిరి మహాశివుడు

అధికారుల నిర్లక్ష్య తీరుపై భక్తుల ఆగ్రహం

మంగళగిరి పట్టణంలో ఆధ్యాత్మిక ఆకర్షణగా నిలిచిన గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానం (శివాలయం) ఆవరణలోని 51 అడుగుల భారీ పరమశివుడి విగ్రహం రాత్రి వేళల్లో అంధకారంలో మునిగిపోతోంది. దాతల సహకారంతో అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న ఈ విగ్రహానికి రాత్రి సమయంలో కనీస విద్యుత్ దీపాల ఏర్పాటు లేకపోవడంపై స్థానిక భక్తులు, పర్యాటకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా వైభవంగా ఆవిష్కరించబడిన ఈ భారీ విగ్రహం పట్టణంలోనే ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది. అయితే, రాత్రి వేళల్లో విగ్రహంపై ప్రత్యేక ఫోకస్ లైట్లు గానీ, హై-మాస్ట్ దీపాలు గానీ వెలగకపోవడంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు శివుడి రూపాన్ని సరిగ్గా దర్శించుకోలేకపోతున్నారు

మంగళగిరి శివాలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన విగ్రహం రాత్రి వేళ చీకటిలో ఉండిపోవడం ఆలయ వైభవానికి అద్దం పట్టడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ స్పందించి, విగ్రహం చుట్టూ రంగుల విద్యుత్ కాంతులు ఏర్పాటు చేసి ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దాలని భక్తులు కోరుతున్నారు.

Leave a Comment