పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. జనసేనలో బాలినేనికి కీలక బాధ్యతలు.. సీమతో పాటు నెల్లూరు, ప్రకాశం కూడా..

Written by TV2O TELUGU

Published on:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు. డీ లిమిటేషన్ ప్రక్రియతో పాటుగా ఏపీలో త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన పార్టీ కమిటీలను ఏర్పాటు చేసింది.
మొత్తం 11 మంది సభ్యులతో మూడు కమిటీలను ఏర్పాటు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. సభ్యులకు తాజాగా జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలతో పాటుగా.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల బాధ్యతలు అప్పగించింది.
పవన్ కళ్యాణ్ ఆదేశాలత బాలినేని శ్రీనివాసరెడ్డి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో పర్యటించనున్నారు. ఆయా జిల్లాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు. డీలిమిటేషన్ అంశాలపై చర్చిస్తారు. అనంతరం ఈ పర్యటన వివరాలతో సమగ్ర నివేదికను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు సమర్పించనున్నారు.
అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కోసం ఏర్పాటు చేసిన కమిటీలో బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటుగా ఆరణి శ్రీనివాసులు, టీసీ వరుణ్‌కు స్థానం కల్పించారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కోసం కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సీహెచ్ వంశీకృష్ణలతో కమిటీ ఏర్పాటైంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కోసం పంతం నానాజీ, బొలిశెట్టి శ్రీనివాస్, కొటికలపూడి గోవిందరావులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల బాధ్యతలను నాదెండ్ల మనోహర్, సామినేని ఉదయభానులకు అప్పగించారు.

Leave a Comment