ఉపాధి నిధులు దుర్వినియోగం… విచారణకు డిమాండ్…

Written by TV2O TELUGU

Published on:

రొంపిచర్ల మండలంలో ఉపాధి నిధుల దుర్వినియోగం.. విచారణకు డిమాండ్

ఉపాధి హామీ పథకంలో అక్రమాలు – విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విన్నపం

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం, మర్రిచెట్టుపాలెం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భారీ అక్రమాలు జరుగుతున్నాయని దీనిపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ఎస్.సి. కాలనీ వాసులు జిల్లా కలెక్టర్‌ గారిని కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ఫిర్యాదుల విభాగంలో బాధితులు తమ ఆవేదనను వినతిపత్రం రూపంలో అందజేశారు.గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, ఉపాధి పనుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపుతున్నారని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామంలోని ఎస్.సి. సామాజిక వర్గానికి చెందిన కూలీలకు ఒక్క రోజు కూడా పని కల్పించకుండా, కేవలం ఒకే వర్గానికి చెందిన వారికే 100% పనులు కల్పిస్తున్నారని వారు పేర్కొన్నారు.ముఖ్యంగా కొంతమంది జాబ్‌కార్డు దారులతో ఫీల్డ్ అసిస్టెంట్ కుమ్మక్కై, వారు పనికి రాకపోయినా ఆన్‌లైన్‌లో హాజరు వేస్తున్నారని తెలిపారు. ఒక్కో జాబ్‌కార్డు పై వచ్చే రూ. 1500/- మొత్తంలో ఫీల్డ్ అసిస్టెంట్ రూ.750/- కమీషన్ రూపంలో తీసుకుంటూ, మిగిలిన సగం డబ్బులు కార్డుదారునికి ఇస్తూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వివరించారు. ఇదే విషయాన్ని తాము ప్రశ్నించగా, “మీకు కూడా ఇలాగే హాజరు వేస్తాను, సగం డబ్బులు నాకివ్వండి” అని ఫీల్డ్ అసిస్టెంట్ బేరసారాలు ఆడారని, అందుకు తాము నిరాకరించి పనులు కల్పించాలని కోరడంతో తమను పూర్తిగా పనులకు దూరం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.ఐరిష్ నమోదులో ఉన్న సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని, ఒకరి స్థానంలో మరొకరి ఫోటోలను అప్‌లోడ్ చేస్తూ రికార్డులను తారుమారు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మండల స్థాయి అధికారులకు ఈ విషయంపై గతంలో మొరపెట్టుకున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, అందుకే జిల్లా కలెక్టర్ స్వయంగా జోక్యం చేసుకుని క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. అర్హులైన తమకు ఉపాధి పనులు కల్పించి, అవినీతికి పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్‌ను విధుల నుండి తొలగించాలని మర్రిచెట్టుపాలెం గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Leave a Comment