
*విస్సన్నపేటలో వ్యవసాయ శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు..
నిషేధిత హెచ్‌టీ (హెర్బిసైడ్ టోలరెంట్) పత్తి విత్తనాలను విక్రయించినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ ఏడీఏ (పీపీ) ఎ. మద్దులేటి హెచ్చరించారు. వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక స్క్వాడ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. విస్సన్నపేట మండల కేంద్రంలోని పలు విత్తన దుకాణాల్లో ఏడీఏ మద్దులేటి, ఏవో వై. శివ శంకర్ రెడ్డి, స్థానిక మండల వ్యవసాయాధికారి జి. రాజ్యలక్ష్మితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు, విక్రయ రసీదులు, నిల్వ ఉన్న విత్తన ప్యాకెట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఏడీఏ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అక్రమ విత్తన విక్రయాలపై నిఘా ఉంచామని, నిబంధనలు అతిక్రమించే డీలర్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
రైతులు కేవలం గుర్తింపు పొందిన డీలర్ల వద్దే ధ్రువీకరించిన విత్తనాలను కొనుగోలు చేయాలని,
ప్రతి కొనుగోలుకు సంబంధించి తప్పనిసరిగా డీలర్ నుంచి పక్కా బిల్లు/రసీదు తీసుకోవాలని,
ఎక్కడైనా నిషేధిత విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు..ఈ తనిఖీల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.