
బెజవాడ నడిబొడ్డున పటమట వంద అడుగుల రోడ్డు ఒక్కసారిగా రణరంగంగా మారింది. సినిమా స్టంట్లను తలపిస్తూ ఇద్దరు యువకులు తమ ‘థార్’ వాహనాలతో సృష్టించిన బీభత్సం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. కేవలం ఒక అమ్మాయి కోసం ఇద్దరు యువకులు రోడ్డుపై నానా హంగామా చేశారు.ట్రాఫిక్ ఎక్కువగా ఉండే పటమట మెయిన్ రోడ్డుపై, తమ లగ్జరీ థార్ వాహనాలతో ఒకరినొకరు ఛేజ్ చేసుకుంటూ.. కావాలనే ఢీకొట్టుకున్నారు. ఇంజిన్ల గర్జనలు, టైర్ల ఘర్షణతో ఆ ప్రాంతమంతా కాసేపు ఏం జరుగుతుందో తెలియని గందరగోళం నెలకొంది. రోడ్డుపై వెళ్తున్న సాధారణ వాహనదారులు, బాటసారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగులు తీశారు.స్థానికుల సమాచారంతో వెంటనే అలర్ట్ అయిన పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై న్యూసెన్స్ సృష్టిస్తూ, ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చిన ఓం రోహిత్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన థార్ వాహనాన్ని సీజ్ చేశారు. కాగా, ఈ గొడవలో ఉన్న మరో యువకుడు ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలో ఇలాంటి ఆకతాయి చేష్టలు, రోడ్ రేజ్‌లకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.