
సామాన్యులకు పొదుపు పాఠాలు చెప్పే ప్రధాని మోదీ… తన సొంత డబ్బా కోసం మాత్రం ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ధ్వజమెత్తారు. మోదీ పొదుపు సూత్రాలపై విమర్శలు గుప్పించారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోందని ఖర్గే మండిపడ్డారు. గత 12 ఏళ్లుగా పింఛన్లను ఒక్క పైసా కూడా పెంచకుండా వారిని వంచిస్తోందని అన్నారు. దేశంలో పెరిగిన ధరల దృష్ట్యా ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర పింఛను సొమ్ముతో కనీసం మందులు, ఆహారం కూడా కొనుక్కోలేని స్థితిలో వృద్ధులు ఉన్నారని అన్నారు. పేదల పింఛన్లు పెంచడానికి మనసు రాని ఈ బుద్దిలేని ప్రభుత్వం.. ప్రచారానికి మాత్రం కోట్లు ఖర్చు చేస్తోందని మండిపడ్డారు.
2014-15, 2024-25 మధ్య బీజేపీ ప్రభుత్వం కేవలం ప్రకటనల కోసమే ఏకంగా రూ.5,987.46 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. ”కోట్లాది మంది వృద్ధులు చాలీచాలని పింఛనుతో ఆకలితో, అనారోగ్యంతో అలమటిస్తుంటే.. మోదీ ప్రభుత్వం మాత్రం ఆర్భాటపు ఎన్నికల ప్రచారాలు, భారీ కాన్వాయ్‌లు, అట్టహాసమైన కార్యక్రమాలు, నాన్‌స్టాప్ పబ్లిసిటీతో కాలక్షేపం చేస్తోంది. తన క్రూరమైన విధానాలతో పేదల ఆర్థిక గౌరవాన్ని హరించివేస్తోంది” అని ఖర్గే అన్నారు.