
అమరావతి: తుళ్లూరు, అమరావతి మండలంలో జరుగుతున్న ల్యాండ్ పూలింగ్ ఈనెల చివరినాటికి 60 శాతం పూర్తవుతుందని మంత్రి నారాయణ ఆశాభవం వ్యక్తం చేశారు..రాజధాని ప్రాంతంలోని భూ సంబంధిత సమస్యలు, గ్రామ కంఠాల అంశాలు మరియు మౌలిక వసతుల అభివృద్ధిపై సీఆర్‌డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మంత్రి నారాయణ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. రాజధాని పరిధిలో ఉన్న గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, రోడ్ల నిర్మాణం వల్ల ప్రభావితమవుతున్న నిర్వాసితుల సమస్యలు మరియు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై విస్తృతంగా చర్చించారు.
సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, సీఆర్‌డీఏకి కొత్త కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయ రామరాజుకు రాజధాని ప్రాంతంలో గ్రామ కంఠాల సమస్యలు, ఎఫ్‌ఎస్‌ఐ అంశాలు మరియు మౌలిక వసతుల అభివృద్ధి వంటి విషయాలపై అధికారులు స్వయంగా గ్రామాల్లో పర్యటించి గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితులను పరిశీలించాలని సూచించినట్లు చెప్పారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని, తద్వారా స్థానిక సమస్యలను సమగ్రంగా అర్థం చేసుకోవచ్చని కమిషనర్‌కు సూచించినట్లు తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతులు, స్మశానాల ఏర్పాటు వంటి అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. అలాగే, ప్రభుత్వం రూపొందించిన పాలసీ ప్రకారమే సమస్యలకు పరిష్కారం అందిస్తామని, వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఆర్-5 జోన్‌ను వెనక్కి తీసుకున్నట్లు, ప్రస్తుతం మూడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ 40 శాతం పూర్తైందని, ఈ నెలాఖరుకల్లా అది 60 శాతానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కౌలు పెంపు కారణంగా రైతులు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, రోడ్ల నిర్మాణాల కారణంగా ఇళ్ళు కోల్పోతున్న వారికి NSP పాలసీ ద్వారా మెరుగైన పరిహారం కల్పించే అంశంపై చర్చించామని తెలిపారు. గ్రామ కంఠాల సమస్యలు ఎవరికి ఇబ్బంది కలగకుండా పరిష్కరించాలని కమిటీ నిర్ణయించిందని చెప్పారు. అలాగే, స్మశానాలు మరియు ఇప్పటికే మంజూరైన మౌలిక వసతులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు… ఈ సమావేశంలో సిఆర్డిఏ కమిషనర్ విజయరామరాజు, అడిషనల్ కమిషనర్ భార్గవ తేజ, మరియు అధికారులు పాల్గొన్నారు..