ఎక్స్’లో శుభాకాంక్షలు తెలియజేసిన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే
మధ్యప్రదేశ్‌లో పర్యటించి కీలక పథకాలకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని
దేశంలోనే తొలి పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన
మహిళలు, చిన్నారుల ఆరోగ్యం కోసం జాతీయ స్థాయిలో రెండు పథకాల ప్రారంభం
దేశవ్యాప్తంగా లక్షకు పైగా భారీ వైద్య శిబిరాల నిర్వహణ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా వేదికగా ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను” అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అటు మల్లికార్జున ఖర్గే కూడా, “ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు లభించాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.
కాగా, ప్రధాని పుట్టినరోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా, భైంసోలా గ్రామంలో పర్యటించనున్నారు. అక్కడ దేశంలోనే మొట్టమొదటి పీఎం మిత్ర (మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అపెరల్) పార్కుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ పార్కు ఏర్పాటుతో రాష్ట్రంలో టెక్స్‌టైల్ పరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు అవుతుంది.
ఇదే పర్యటనలో ప్రధాని మరో రెండు కీలకమైన జాతీయ పథకాలను ప్రారంభించనున్నారు. మహిళలు, చిన్నారులు, కౌమార బాలికల ఆరోగ్యం, పోషకాహార సేవలను బలోపేతం చేసే లక్ష్యంతో ‘స్వస్థ నారి, సశక్త్ పరివార్’, ఎనిమిదవ ‘రాష్ట్రీయ పోషణ్ మాహ్’ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా లక్షకు పైగా ప్రత్యేక ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నారు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆరోగ్య కార్యక్రమంగా నిలవనుంది. ఈ శిబిరాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, రక్తహీనత, టీబీ, సికిల్ సెల్ వ్యాధి పరీక్షలతో పాటు గర్భిణులు, బాలింతలకు వైద్య సేవలు అందిస్తారు. గైనకాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ వంటి ప్రత్యేక వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచనున్నారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.