అవకాశాలకు అనుగుణంగా మారిపోతున్న రాజకీయ పొత్తులు…!

Written by TV2O TELUGU

Updated on:

Tv20 News Telugu-Bihar

నితీష్ కుమార్.! తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వారానికే రాజీనామా చేయవలసి వచ్చింది. కానీ 2005 నుండి ముఖ్యమంత్రి పీఠాన్ని వదలకుండా పట్టుకునే వున్నాడు. అలా అని ఆయనకు ఒకసారి మినహాయించి ప్రజలు ఎప్పుడూ నీరాజనాలు పలికింది కూడా లేదు. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో ఆర్జేడీ పొత్తులో తక్కువ సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి అవగలిగారు. ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకొనే సమయం ఆసన్నమవగానే ఎన్డీయే గూటికి చేరి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇరవైరెండు సంవత్సరాల ముఖ్యమంత్రిత్వంలో ఎనిమిది సార్లు ప్రమాణస్వీకారం చేశాడు. ఎన్నిసార్లు అటునుండి ఇటువైపు, ఇటునుండి అటువైపు వెళ్లినా, తనకంటే ఎక్కువసీట్లు వచ్చిన వారితోనే పొత్తులో వున్నా తానే ముఖ్యమంత్రిగా కొనసాగటం ఆయన రాజకీయ చతురత. గత శాసనసభ ఎన్నికలలో బీజేపీ అనూహ్యంగా తన బలాన్ని పెంచుకోగలిగింది. బహుశా 2024 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో నితీష్ కుమార్ 16 పార్లమెంటు సీట్లు గెలిచి వుండకపోతే పరిస్థితి ఎలా ఉండేదో కానీ, ఆయన కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక భాగస్వామి అవటం ఆయనకు లాభించింది. కానీ నితీష్ కుమార్ మొన్నటి బహిరంగ సభలో తాను మహాఘట్బంధన్ లోకి వెళ్లి ఇబ్బందులు పడ్డానని, అందుకే మరలా ఎన్డీయే లోకి వచ్చానని సంజాయిషీ ఇవ్వవలసి వచ్చింది. ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు ఉన్న పొత్తులో పొందిన ముఖ్యమంత్రి పదవిని అంటిపెట్టుకోవటం కోసమే పొత్తులను మార్చుకోవటం ఆయన ప్రత్యేకత. ఎన్నికల పొత్తులు కుదుర్చుకోవటంలో మార్పులు చేసుకున్నవారిని అనేకమందిని చూస్తున్నాము. రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు వుండకపోవచ్చు. కానీ అధికారం కోసం పొత్తులను మార్చుకున్న నితీష్ కుమార్ రేపు ఎన్నికల్లో ఓడిపోయినా ఏదో ఒక పదవిలో మాత్రం వుంటారు. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా ప్రజలు తమ అభీష్టాన్ని తెలిపిన తరువాత రాజకీయపార్టీలు ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా అధికార పొత్తులు కుదుర్చుకుంటున్నారు. ఎన్నికల పొత్తులు కూడా విచిత్రంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు హయాంలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ జరిగిన కార్యక్రమాలలో, పోలీసు కాల్పుల్లో రామకృష్ణ అనే సీపీఎం కార్యకర్త మరణించారు. ఇప్పటికీ రామకృష్ణ స్మారక సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబును నియంత అనే అంటూ వుంటారు. కానీ బషీర్బాగ్ సంఘటన జరిగిన తరువాత 2009 లో జరిగిన ఎన్నికలలో అదే నియంత చంద్రబాబుతో సీపీఎం వారు ఎన్నికలపొత్తు పెట్టుకున్నారు. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, టీడీపీ కలసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలలో సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. ఆ ఎన్నికలలో మహాకూటమి గెలిచి వుంటే, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వానికి సీపీఎం బయటినుండి మద్దతు ఇచ్చేదో, ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండేదో కానీ, మహాకూటమి ఓడిపోయింది. వైఎస్ రాజశేఖరరెడ్డి అవినీతికి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడింది. ఆరోజు జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి కూడా కూటమి నాయకులు మాట్లాడారు. కానీ చంద్రబాబును నియంత అనుకుని కూడా ఆయనతో పొత్తు పెట్టుకోవటం అనే విషయాన్ని ఎలా సమర్థించుకోగలుగుతారో అర్థం కాదు. అవకాశవాదులతోనో, బూర్జువా పార్టీలతోనో పొత్తులు పెట్టుకోవటం వేరు, కానీ ఒక నియంతతో పొత్తు పెట్టుకోవటం సీపీఎం ఎలా చేసింది వారే చెప్పాలి. లేదా 2000 సంవత్సరంలో నియంతగా ఉన్న చంద్రబాబు, 2009 లో ప్రజాస్వామికవాదిగా మారారని సీపీఎం భావించిందో అర్థం కాదు. బషీర్బాగ్ కాల్పుల ఘటన జరిగి పాతిక సంవత్సరాలు అయిన సందర్భంగా వారు నిర్వహించిన కార్యక్రమంలో కూడా చంద్రబాబును నియంత అనే పోస్టులు పెట్టారు, ఉపన్యాసాలు చెప్పారు. హిట్లర్ ను వ్యతిరేకించటానికి రష్యా, బ్రిటన్లు కలసి పోరాడాయి. కారణం హిట్లర్ నియంత కాబట్టి. స్వదేశంలో స్టాలిన్ నియంతలా వ్యవహరించాడని చరిత్రలో స్టాలిన్ కు చోటు లేకుండా చేసిన చరిత్ర కమ్యూనిస్టులది. కానీ చంద్రబాబు విషయంలో సీపీఎం ద్వంద ప్రమాణాలు పాటించుతున్నది అనిపిస్తుంది. మహాకూటమి ఏర్పడినదే వైయస్ఆర్, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి అవినీతికి వ్యతిరేకంగా. ప్రజలు ఆరోజున పొత్తును అంగీకరించక పోవటంలో చంద్రబాబు పైన సీపీఎం వారు వేసిన నియంత అనే ముద్రను ఆక్సెప్ట్ చెయ్యలేదు అనటానికి తార్కాణం టీడీపీకి సీట్లు బాగానే వచ్చాయి. అప్పుడే కాదు, 2014 లో కూడా అంతటి ప్రాంతీయ వాదంలో, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో కూడా టీడీపీ బీజేపీ పొత్తుకు ఇరవై సీట్లు వచ్చాయి. ఒకనాడు ప్రపంచ బ్యాంకు ఏజెంట్ అని చంద్రబాబుకు ముద్ర వేసిన సీపీఎం పరిపాలిస్తున్న కేరళ రాష్ట్రప్రభుత్వం, ఈరోజు అదే ప్రపంచబ్యాంక్ నుండి అప్పు తీసుకుని అనేక రంగాలలో ఉపయోగించుకొంటున్నది. ప్రపంచమంతా ప్రస్తుతం నడుస్తున్న దారిలో చంద్రబాబు ముందు నడిచాడు కాబట్టి ఆయనకు ప్రపంచ బ్యాంకు ఏజెంట్ అనే ఒక ముద్ర వేశారు. ప్రజలు చంద్రబాబును నియంతగా పరిగణించి వుంటే ఆయన ఏనాడో రాజకీయాలకు స్వస్తి పలకవలసి వచ్చేది. వైసీపీ పాలనలోని అరాచకం, జగన్మోహన్ రెడ్డిలోని నియంత ఒక జాతీయ పార్టీగా ఉన్న సీపీఎం కు కనిపించకపోవటం దురదృష్టం. చంద్రబాబు ఎన్నికల పొత్తులు మార్చుకుని ఉండవచ్చు. కానీ ఒకసారి మద్దతు పలికిన తరువాత అనవసరపు కారణాలతో ప్రభుత్వాలను కూల్చటం ఎప్పుడూ చేయలేదు. చంద్రబాబు ఎప్పడు సుస్థిరమైన ప్రభుత్వాలు వుండాలనే తపన పడ్డాడు అనేది అందరూ ఒప్పుకొనే విషయం. ఆయన ఆర్ధికవిధానాలతో ఏకీభవించని వారైనా ఆయనను నియంత అని మాత్రం అనలేరు. చంద్రబాబు, ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైన రోజు నుండీ ఒక విజన్ తో సాగుతున్నాడు. అందులో అన్ని అందరికీ నచ్చేవి కాకపోవచ్చు, ఆయన విధానాలను విమర్శించవలసిన ఒక జాతీయపార్టీ, పది సంవత్సరాలుగా కఠినమైన వైఖరితో వ్యతిరేకిస్తూ వుండటం వలన ప్రజలకు వారే దూరమవుతున్నారు. ఓటు వేసే ప్రజల దృక్పథం నుండి ఆలోచిస్తే ప్రజలకు అవసరమైన విషయాలు అర్థమవుతాయి. అప్పుడే ప్రజాఉద్యమాలు చేయగలుగుతారు.అప్పుడు చంద్రబాబు తో కలసి పోటీ చేయటం తప్పో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి, అరాచకాలను సమర్ధించటం తప్పో ప్రజలకు స్పష్టం చేయాల్సిన సీపీఎం పార్టీ అలా చేయడం లేదు. పది సంవత్సరాలుగా కర్ణాటకలో రాజకీయ పరిణామాలు, మహారాష్ట్రలో వేగంగా మారిపోయిన రాజకీయ ఎత్తుగడలు గమనిస్తూనే వున్నాము. దేశంలో ప్రజాస్వామ్యం ఏ తీరున ఖూనీ అవుతుందో అర్థం చేసుకోవటం కూడా కష్టంగానే వుంటున్నది. గవర్నర్లు రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు. తమిళనాడులో పార్టీ ఫిరాయింపులు వినటం చాలా తక్కువ. అందుకే గవర్నర్ల పాలన మొదలైంది. ప్రజల మనోభీష్టానికి విలువలేని ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్ధకంగా
మిగిలిపోతున్నది….

🔴Related Post

Leave a Comment